May 24, 2011

మళ్ళీ ఎప్పుడో...

 
 పుస్తకాలు సర్దుతోంటే.. పుస్తకాల వెనక సాక్స్ లోంచి జారి పడ్డాయి..గోలీలు.  ఎన్నాళ్ళ  నుంచి  బందించావో తెలుసా..అంటూ చెంగు చెంగున దూకుతూ ఒక్కోటి.. ఒక్కో మూలకి పరిగెత్తి దాక్కున్నాయి..
నేను ఒక్కొక్కటీ వెతకటం మొదలు పెట్టాను. కంప్యూటర్ టేబుల్ కాలికి అటుపక్కన నక్కికూర్చుంది  పాలపిట్ట. చిన్ని గాజు గోలి కి మధ్యలో మల్లె పువ్వులా తెల్లని మరక. అన్నింటిలోకి చిన్నగా ఉన్న గోలీ ని 'పిట్టి' అని పిలిచే వాళ్ళం.  
 చీపురు కట్ట వెనకాల నక్కింది బెల్లం రంగు గోలీ.. న్యూస్ పేపర్ కింద దాక్కుంది  ఎరుపుది . టేబుల్ ఫ్యాన్ పక్కగా అకుపచ్చది...ఇలా రంగు రంగుల గోలీలు....అన్నీ ఏరాను.
స్కూల్ బాగ్ గూట్లోకి విసిరి కొట్టి... నా గోలీలా డబ్బా తీసుకొని  తోటలోకి పరిగెత్తేవాడిని. మా ఇంటికి ఎదురుగా..రోడ్డుకు అటువైపున ఉన్న ఇళ్ళ వెనకాల  చింత చెట్లు..మామిడి చెట్లు..వేప చెట్లు ఉన్నాయి..వాటి కిందే మా ఆటలన్నీ ..
నేను గోలీలు కొన్నది బహు తక్కువ.. ఎప్పుడు ఎవరిదగ్గరైనా అప్పు తో మొదలు పెట్టి  ఆటలో గెలిచి అప్పు తీర్చేవాడిని.మా ఏరియా లో గోలీ ఆటలో మనది సిద్ద హస్తమే. బాగా గెలిచి అక్కడి కక్కడ అమ్మేవాడిని.
మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గోలీలు ఆడనిచ్చేవాళ్ళు కాదు. దుమ్ములో ఆడటం ..కొట్లాటలు.. వాటిని అమ్మటం..ఇవేవీ వాళ్ళకి నచ్చేది కాదు. అలా అని నేను ఉరుకున్నదీ లేదు. 

తల రెండో ..నాలుగో.. గోలీలు వేసికొని..ఒక పెద్ద గుండ్రం లోకి విసరటం.. చిపించిన గోలీని గురిచూసి కొట్టటం... తగిలిందా..తగిలి మిగతావాటికి తగలకుండా..కొట్టిందీ..తగిలిందీ రెండు గుండ్రం బయటకి పరిగేట్టాయా.. ఇహ మనవే ఆ గోలీలన్నీ.. ఒకవేళ వేరే దానికి తగిలినా..కొట్టింది గుండ్రం బయటకి రాకపోయినా..బొచ్చే ...
ఇదీ బొంబాయి ఆట..

ఒక చిన్న గుండ్రమో...చేతురస్రమో గీసి..అందుకో తలా కొన్ని గోలీలు వేసి ..పేర్చి.. బొటన వేలిని నేలమీద  ఉంది..చూపుడు/మధ్య వేలితో గాట్టిగా ఆ గోలీలని కొట్టటం.. అలా ఎన్ని గోలీలు బయటికి వస్తే అన్నీ మనవే. ఒకవేళ కొట్టింది అక్కడే చిక్కిందా మనం అవుట్.  
ఎవడు కనిపెట్టాడో కానీ భలే గా ఉండేవి ఆటలు.

అలా రెండు గంటలు దుమ్ములో ఆది..ఇరవై..ముప్పై గోలీలు గెలిచి  అమ్మితే   తెల్లారికి పాకెట్ మనీ దొరికేది రూపాయో..ఆటానా నో.. తెల్లారి బడి దగ్గర ఎం కొనుక్కొని తిందామా అని ఉహిస్తూ..నోట్లో నీళ్ళురేది
మిగిలిన గోలీలు జేబులో వేసుకొని మళ్ళీ ఇంటికి పరుగు ..గోలీలు  ఊరుకుంటాయా.....గళ్ళు గళ్ళు మని ఒకటే చప్పుడు.. నా ఆనందాని తాము వ్యక్త పరుస్తూ..
ఆ చప్పుడు అమ్మ గానీ వినిందంటే  మీ బతుకు మోరీ పాలే అని చెప్పి జేబుల్లో చేతులు దూర్చి వాటి నోరు నొక్కే వాడిని.
చప్పుడు కాకుండా ఓ డబ్బాలో వేసి  పుస్తకాల వెనకాల దాచేసేవాడిని.
సాయంత్రం నాతో పాటే వాటికీ ఓ రెండుగంటల స్వేఛ్చ.అందుకే అటు ఇటు..దొర్లుతూ పరిగెత్తేవి..

ఏరిన జ్ఞాపకాలని మళ్ళీ సాక్స్ లో వేసి మూటకట్టి పుస్తకాల వెనక పెట్టాను...మళ్ళీ వాటికి స్వేఛ్చ ఎప్పుడో...

No comments: