Dec 11, 2012

జీవిత మకరందాలు



ఓ పెంకుటిల్లు ,ముందు వాకిలి.. ఓ నాలుగు పూల మొక్కలు, 
ఓ అయిదారు అల్లరి పిల్లలని వెనకేసుకొని ఓ కోడి పెట్ట ..

గడ్డి నేమరేస్స్తున్న గేదె, పక్కనే మూతి నాక్కుంటూ ఓ దూడ ,ఎక్కడినుంచో వచ్చి పంచన చేరి ఒళ్ళు విరుచుకుంటూకుక్క ..

.. హాల్లో, తాతగారి వాలు కుర్చీ, ఓ మూలకి నక్కిన నులక మంచం, తలుపులు లేని గూట్లో కిరసనాయిలు దీపపు బుడ్డీ ..

వంటింట్లో బంగారపు మెరుపుతో రెండు ఇత్తడి బిందెలు, దూలానికి వేలాడుతున్న ఉట్టి..

పెరట్లో జామ చెట్టు, గోడవారగా టమాటా, మిరప మొక్కలు, బీర కాయ తీగో, గుమ్మడి పాదో అలా పిట్టగోడ మీదకి పాకి, వేసిన చిన్ని పిందెలు..

ఇవేకదా పల్లె ఇంటి అందాలు.. జీవిత మకరందాలు.

Dec 9, 2012

నేను పరుగులు తీస్తుంటాను..


అపార్ట్మెంట్ గూళ్ళ సాక్షిగా..  .. 
క్రిక్కిరిసిన రోడ్ల సాక్షిగా 
విద్యుద్దీపాల ధగధగల సాక్షిగా 
నేను పరుగులు తీస్తాను..
బస్సుల్లో ...బైకుల్లో..కార్లల్లో..
నేను పరుగులు తీస్తుంటాను..
అటు నించి ఇటు.. ఇటు నించి అటు..
అలసినా ...సోలసినా..ఆయాసం వచ్చినా 
పరుగులు పెడుతూనే ఉంటాను..
ఇది బతుకు పరుగు..చచ్చేదాకా ఆగేది కాదు.

రూపాయి కోసం నన్ను నేను తాకట్టు పెట్టుకుంటాను..
మంచి..మమతని అనుక్షణం చంపి పాతర వేస్తుంటాను..
జీవితపు అందం ఆనందం అంతా పచ్చనోటు రెప రేపల్లోనే కనబడుతుంది నాకు...
అర్థరాత్రి చాతి ఎడమపక్క కలుక్కుమంటే.. డబ్బులేకుండా ఈ పట్నంలో అడిగేదిక్కేది
..పిల్లల్ని కనాలన్నా వాళ్ళ చదువు కొనాలన్నా .....వాళ్ళ పెళ్ళిళ్ళు కుదరాలన్నా ఆ నోట్లే అవసరం..
బ్యాంకు బాలెన్సు  ఇచ్చే ప్రశాంతత నాకేదీ ఇవ్వదు.
ఆత్మీయత , అనురాగం అన్నీ రూపాయి తరవాతే...
రూపాయికి ఉన్న విలువ మనిషికెక్కడిది ??
అందుకే..
కాలే కడుపు సాక్షిగా..
పెరిగే అవసరాల సాక్షిగా .
నేను పరుగులు తీస్తుంటాను..