Feb 14, 2011

చిలక జోస్యం

 అతి కష్టం మీద రాజు గాడు  శృతి ని necklace రోడ్డు కు తీసుకొచ్చాడు..
రానంటే రాను.... ఏదో చాటింగు ..ఫోన్ లో మాట్లాడుకోడం  ఓకే కాని ఇవన్నీ ఇవన్నీ నాకస్సలు ఇష్టం ఉండదు .. చెప్పింది.
కాని వీడు వింటేగా.. అలకలు..కులుకులు.. ఓ రెండు రోజులు మాటలు లేకపోవటాలు....రాకపోతే నీకు నాకు కట్టు అన్నట్టు,  online లో మూతి  భిగించే సరికి  ..సరే .. ఒక్క సారికి ఒకే అని అంది.  
ఆహా..ఏమి భాగ్యం అని రాజు గాడు షర్టుకు డబ్బుల్లేక  deodorant మాత్రం కొత్తది కొనుక్కొని ఒళ్ళంతా దట్టంగా పట్టించి బయలుదేరాడు. ముందుగ 'తాళ్ళ పాక తిమ్మక్క' విగ్రహం దగ్గర కలుసుకొన్నారు. ఎన్నడూ బైక్ ఎక్కనట్టు పల్లకీ లోకి పెళ్ళికూతురు లా  బైక్ ఎక్కింది. రాజు గాడి బ్రేక్ లైనేర్స్  సగం అరిగాయి కాని  లాభం లేకపోయింది. పూర్తిగా అరగోట్టుకోవటం జేబుకు మరో బొక్క అని ఊరుకున్నాడు.
పార్కింగ్ టికెట్టు కొంటూ...మళ్లీ ఇంకోసారి తన 500/- తడిమి చూసుకున్నాడు. ఇది చెల్లకపోతే  అన్న negative  thought ని అక్కడికక్కడే నిలువున చీరేసి ..అడ్డంగా  నరికేసి .మొత్తానికి .చంపేసి.. కొంచం సేపు వాల్క్ చేద్దామా అన్నాడు. " కాఫీ ని మనసులోకి అప్పుడే రానివ్వకుండా..
 చుట్టూ చేతుల్లో చేతులేసుకున్న జంటలు  ..పార్కులో ఆడుకునే పిల్లలు .. చాయ్,, సిగరెట్లు , ఐస్ క్రీం లు....బెలూన్ లు.  అమ్ముకునే వాళ్ళు....ఇలా రక రకాల జనం తో బాగానే కళ కళ లాడుతోంది.. 

నడుస్తూ...కొంచం దూరమే వొచ్చారు. ఇప్పుడు తక్కువ జంటలు..ఎక్కువ దగ్గరగా ఉన్నారు. బుద్దుడి విగ్రహం వీపు  బాగా కనపడుతోంది అనే వొంకతో ఆగాడు..ఇద్దరి మధ్య  దూరం తగ్గింది.. ...కాలుష్యం వాసన వేస్తున్నా  గాలి చల్లగానే ఉంది.. ఎదురెదురుగా నిలబడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ... మాట్లాడుతున్నాడు.
సర్  ' చిలక ...చిలక  జోస్యం.. జరిగింది  జరిగినట్టు చెపుతుంది".. అన్నాడు ఒక కుర్రాడు..
చిన్న బోనులో.. తినలేక వొదిలేసిన   జామ కాయ  బిక్క మొహం తో ఓ చిలక..రాజుగాడిని చూసింది.
వద్దు వెళ్ళు.. అన్నాడు రాజు..
ఓ అయిదు నిముషాలు గడిచాయి.
రేలింగ్ మీద పెట్టిన చెయ్యికి ఒడుపుగా చెయ్యి తాకించాడు. శృతి కూడ.. గమనించనట్టే నటించింది.. రాజుకి  హుశారేక్కువైంది.. చేతిని చేయ్యిలోకి తెసుకున్నాడు.
"చెయ్యి వదులు" .. మాట మాత్రం అంది కాని వొదిలించుకునే ప్రయత్నం ఏమి చేయలేదు. శృతి.
 ఓ చేత్తో బుజాన్ని చుట్టి దగరగా తీసుకుందాం అనుకొని చెయ్యి వెనక  నుండి వేస్తున్నాడో లేదో..
సార్  " జరుగుతున్నది జరిగినట్టే చెపుతుంది .చేప్పించుకోండి సర్...."
కోపం దిగమింగి   వొద్దు బాబు . అవసరం లేదు..అన్నాడు..
మళ్లీ  ఇద్దరి    మధ్య దూరం పెరిగింది. కొంచం సేపూ మామూలు మాటలు..ఇందాకటి పోసిషన్ రావటానికి ఇద్దరికీ ఎక్కువ సేపు పట్టలేదు. మళ్లీ  మునపటి  మూడ్ వొచ్చింది . శృతి  మనసు కూడ గతి తప్పుతోంది. బుజం మీద చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు. నాకేం తెలిదు అన్నట్టు ఏదో  హు కొడుతోంది   శృతి ..   దగ్గరిగా జరిగి  మొహాన్ని మొహం దగ్గరగా తెసుకొని వొచ్చి ముద్దు పెట్టుకుందాం అనేంతలో..

" జరిగింది ..జరిగేది ,,జరగా బోయేది.. చెపుతా...సర్ చెప్పించుకోండి సర్  అని  ఇంకో  కుర్రాడు మళ్లీ  చెయ్యి గోకాడు..
ఒక్క సారి కోపం కపాళానికి అంటింది రాజు గాడికి, 
" రేయ్ చెప్పించుకోడం  కాదురా..చెప్పుచ్చుకుంటా" అని వాడి వెనక పడ్డాడు. విషయాన్ని ఫాస్ట్ గా  గ్రహించిన అ కుర్రాడు  పరుగందుకున్నాడు .
అ పరుగులో... ఆ కుర్రాడు  పట్టు తప్పి పడటం.. బోను కింద పడి తెరచు కోవటం..చిలక తుర్రు మనటం జరిగి పోయాయి.  
ఇదంతా చూసి శృతి .. చిలకలా  కిలకిలా నవ్వింది.





No comments: