Sep 15, 2008

అంతిమ సంస్కారం


ఏదో పనిలో నేను SR Nagar లో ఉండగా, నా సెల్ ఫోన్ మోగింది. మా వదినచెప్పింది "
అమ్మమ్మ చనిపోయిందని ". నాకేమీ బాధ అనిపించ లేదు. ఎందుకంటే గత రెండు
సంవత్సరాలనుండి ఆమె మంచం పై జీవచ్చవంలా పడి ఉండేది, కళ్ళు తప్ప ఇంకేవి కదపలేని
స్థితిలో.. తాతచనిపోయిన కొద్ది రోజులకే అమ్మమ్మ పరిస్థితి  క్షీణించింది. 80
సంవత్సరాల పైబడి వయసు, నడవలేనిస్థితిలో నేల మీద పాకుతూ రెండు సంవత్సరాలు
గడిపింది, తరవాత అసలు కుర్చోలేని స్థితి.. ఆ తరవాత చేతులు కూడా కదపలేని స్థితి.
ఇద్దరు వ్యక్తులు ఆమెని చూసుకోటానికి ఉండవలసివచ్చేది. ఆడవ్యక్తి కనక ఆడవాళ్లే
అవసరం. అలా అమ్మమ్మ పరిస్థితి  విషమం.అందుకే అమ్మమ్మ చనిపోయిందన్న విషయం
పెద్దగా బాధించలేదు.అలాంటి  స్థితిలో ఎవరు మాత్రం బ్రతకాలనికోరుకుంటారు?? అదృష్టవ
శాత్తు, అమ్మమ్మ చనిపోయే టప్పుడు మా అమ్మ ఆమె  దగ్గరే ఉంది.మా అమ్మ అందరిలోకి
చాలఏమోషనల్. అక్కడే ఉండటం చేత చివరి దశలో తానామే పక్కనే ఉన్నానన్న తృప్తి
మిగులుతుంది.

నేను రూమ్ కివచ్చి బెంగుళూరు లో ఉన్న మా బావకి ఫోన్ చేసాను..రాత్రి 8 గంటల
కల్లా  తాను హైదరాబాద్  వస్తున్నానని చెప్పాడు. అతను  రాగానే ఇద్దరం బయలుదేరాము
అమ్మమ్మ వాళ్ళ ఊరికి ... "వేలూరు" ..హైదరాబాద్ నుండి 60 km దూరంలో ఉన్న
పల్లెటూరు. పక్క town నుండి 10 km. 7 seat auto ల పుణ్యమాని అర్ధరాత్రి కూడా
ప్రయాణం చేయొచ్చు,కనక పెద్దగా ప్రయాస  పడకుండానే ఊరికి వెళ్ళాము.
ఇంటిముందు జంపుఖానా లో ఒకరిద్దరు నిద్రపోతూ ఉన్నారు. ఇల్లంతా నిశబ్దంగా ఉంది. 
'పుట్టిన వానికిమరణము తప్పదు.. మరణించిన వానికి జన్మము తప్పదు.. అనివార్య మగు
ఈ  విషయమై చింతింప తగదు' ... ఘంటసాల గారి భగవద్గీత సన్నగా చెవులని తాకింది. 
చెప్పులు  ఒక మూల వదిలి ఇంట్లోకి వెళ్ళాను.. అమ్మమ్మ చుట్టూ చిన్నమ్మలు,
అత్తయ్య లు కూర్చొని ఉన్నారు.. వాళ కళ్ళన్నీ ఎర్రగా ఉబ్బి ఉన్నాయి..అప్పటివరకు
ఎంతగా ఏడిచారో తెలియజేస్తూ.. నేను మౌనంగా సాష్టాంగ నమస్కారం చేశాను.. ఆమె
ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించి రెండు నిమిషాల తరవాత లేచాను. మెల్లగా వచ్చి
మా అమ్మ పక్కన కూర్చొన్నాను. నన్ను చూడగానే అమ్మ బావురుమంది, నన్నుపట్టుకొని.
ఏమని ఓదార్చను?? కని ..పెంచి ...ప్రేమానురాగాలు పంచిన మాతృ మూర్తి, .. తల్లి ..
పోతే పడే బాధను ఎవరుమాత్రం ఆపగలరు?? జ్ఞాపకాల వెల్లువ ఉప్పొంగుతుండగా వెక్కి
వెక్కి ఏడ్చింది.. చక్రీ  మా అమ్మరా అంటూ. నేనుమాత్రం అలాగే మౌనగా ఉండి
పోయాను..
 ఆశ్యర్యం.. నా కంట్లో చిన్న కన్నీటి చుక్క కూడా లేదు..ఎడవాలని ప్రయత్నించాను,
కాని ఏడుపు రావటం లేదు.
  అమ్మమ్మ జ్ఞాపకాల కోసం మనసంతా వెతికాను. .. రాలేదు.. ఇదేమిటి నా గుండెలో
అమ్మమ్మకోసం ఒక్క జ్ఞాపకం కూడా లేదా ..కంట్లో ఒక్క బొట్టు నీరైన లేదా??
 ప్రతి ఎండాకాలం సెలవుల్లో మేము అమ్మమ్మ  ఇంటికేవచ్చే వాళ్ళం. అమ్మను మరిపిస్తూ
మాకు అన్నం పెట్టేది, మాట్లాడేది,, కథలు చెప్పి మురిపించేది. ఎన్నెన్నో
తినుబండారాలు చేసి పెట్టేది. వీటిల్లో ఒక్క జ్ఞాపకం కూడా న మనసుకు తట్టటం
లేదు.. బహుశా నా ప్రస్తుత జీవితం నన్నురాయిలా మార్చిందేమో..కొద్ది నిముషాలు
అలాగే కూర్చున్నాను.అందరు మౌనంగా చూస్తున్నారు.. చిన్నమ్మలూ, అత్తయ్యలు..ఇక
అక్కడ కూర్చోలేక బయటికి వచ్చి జంపు ఖానా లో కూర్చొన్నాను.. ఇంతలొ మా మామయ్య
(మేనమామ )వచ్చి  నా ముందు కూర్చొన్నాడు, నేను అతని చేతిలో చేయి వేసి మౌనం
వహించాను.
ఏమని చెప్పను? ఈఓదార్పు మాటలు దుఖాన్ని ఎక్కువ చేస్తాయి కాని తగ్గించవని నా
అభిప్రాయం. అందుకే అలా మౌనంగాఉండిపోయాను.. ఒక ఐదు నిముషాల తరవాత అతనే  " ఎవరు
చెప్పారు విషయం" అని అన్డుగుతూనే ..అమ్మమ్మ చివరినిముషలో పడిన బాధనంతా
చెప్పాడు. అదంతా వింటుంటే..ఎందుకు మనిషికి ఇన్ని బాధలు పెట్టడు దేవుడు అని
అనిపించింది.   బావ కూడా కొద్ది సేపు లోపలకు వెళ్లి వచ్చాక   ఇక ఇద్దరం ఉదయం 4
గంటలవరకు ఏదో మాట్లాడుకొన్నాం. నేను అక్కడే నిద్రలోకి జారుకున్నా...

ఉదయం 5.30 అవుతుండగా అత్తయ్య నిద్ర లేపింది , పకనున్న టౌన్ కెళ్ళి పాలు ,
అత్యవసర సరకులు తీసుకొని రమ్మని. కొద్ది సేపట్లో బంధువర్గం అంతా వొచ్చేస్తారు,
ఎంత చావైనా కొంచం 'చాయ్' అయినా తాగాలి కదా..నేను ముఖం కడుక్కొని, ఓ కజిన్ తో
పాటు స్కూటర్ పై టౌన్ బయలుదేరాను. మేము తిరిగి వొచ్చేసరికి ఇల్లంతా  బంధువులతో
నిండిపోయింది. నేను పాలు ఇతర సరకులు అప్పగించి  వాకిట్లోకి వచ్చాను. అంతిమ
యాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు పాడె  కడుతున్నారు, తెల్లని బట్ట , కొత్త
చీర తెప్పించారు.. బావ కొత్తకుండలకోసం వెళ్ళాడు. ఇంతలొ ఎవరో అన్నారు "త్వరగా
కానీయండి .. ఎంత ఉదయం చేస్తే అంత మంచిది.. పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి".
అప్పుడే 8 కావొస్తోంది. ఇంతలొ చాయ్ తయారైంది.. దూరపు బందువులు అందరూ వేడి వేడి
గా చాయ్ ని గొంతు లోకి జార్చారు.
  యువకులం ఓ పది మందిమి.. దగ్గరలోని బోర్ బావి  దగ్గరికి వెళ్ళాము. అమాంతంగా
నల్లా కింద కూర్చొని మడి స్నానం చేసాము. ఎర్రని పంచెలు కట్టి, రెండు బిందెల
నీళ్ళతో ఇంటికొచ్చాము. మేము వొస్తుంటే అందరూ దూరంగా జరిగి మాకు దారి ఇచ్చారు.
వాకిట్లో కుర్చీ వేసారు.. దాని వయసు అమ్మమ కంటే ఎక్కువే అనుకుంటా.. అమ్మమ్మని ఆ
కుర్చీలో కూర్చుండబెట్టాం. నారాయణ మంత్రం ఉచ్చరిస్తూ స్నానం చేయించారు . మేము
పట్టు పంచలతో కుర్చీ చుట్టూ పట్టుకుంటే ..కొత్త చీర కట్టించారు..ముఖాన
గోపిచందనం పెట్టి నోట్లో తీర్థం, తులసి దళం వేసారు. మెల్లిగా అమ్మమ్మని పాడే
మీద పడుకోబెట్టాము.. తాళ్ళతో గట్టిగా కట్టి.. చుట్టూ 8 చోట్లలో నీళ్లు చల్లి .
బియ్యము, నువ్వులు ఉంచాము. ఏడుపులు ఎక్కువయ్యాయి. మా అమ్మని ఆపడం ఎవరితరము
కావటం లేదు. " ఓం నమో నారాయణనాయ .. ..ఓం నమో నారాయణనాయ " అంటూ  నారాయణ మంత్రం
నిరాఘాటంగా ఉచ్చరిస్తూ పాడెని  ఎత్తి బయలుదేరాము.
బందువులు.. స్నేహితులు...ఆప్తులు.. ఊరిజనం.. దారిన పోయే దానయ్యలు...అందరూ
చూస్తున్నారు " ఒక మనిషి అంతిమ యాత్ర" 

జీవితం ఒక పండగ...
పనిషి పుట్టిన నాటి నుండి  చనిపోయే వరకు పండగే ..
"పుట్టటం .. బారసాల..పుట్టిన రోజులు..పెద్దమనిషి కావటం/ఉపనయనం... పెళ్లి ..
పిల్లలు.....చివరికి 'చావు'కూడా ....అన్నీ పండగలే"
Life is a celebration .

మేము శవాన్ని తీసుకొని ఊరిబయట చెరువు గట్టుకి వెళ్తున్నాము..బందు మిత్ర గణం  ఆమెతో
తమకున్న అనుభంధం ..ఆత్మీయత,. తమ జ్ఞాపకాలు ..ఆమె అనురాగం ..గుణ గణాలు....అన్నీ
ఒకరికొకరు చెప్పుకుంటూ అనుసరిస్తునారు. మూడు చోట్లలో కిందకి దించి మళ్ళీ
నీళ్ళు చల్లి, బియ్యము..నువ్వులు పెట్టారు. చెరువుగట్టుకి పక్కగా ఉన్న పొలం
లో..చితి ఏర్పాటు చేసారు. అమ్మమ్మని చితి పై పడుకోబెట్టాము. అందరూ ఒక్కో కట్టే
ని ఆమెపై ఉంచారు. అక్కడక్కడ  చితి కట్టెలపై కిరోసిన్  చల్లారు. ఇక మిగతా తంతు
జరిగిన తరవాత తల దగ్గర నిప్పు అంటించి తల్లి ఋణం తీర్చుకున్నాడు, మామయ్య .
అప్పటివరకు మౌనంగా గుండె నిండా బాధ నిపుకున్న మావయ్య నిప్పంటించగానే ఒక్కసారిగా
అమ్మా.. అమ్మా అంటూ  బావురుమన్నాడు.

ఒక తల్లి.. ఒక జీవితం..ఒక జ్ఞాపకం ..ముగిసిపోయింది.. ఎవరాపగలరు అతన్ని..ఏమని ఆపగలరు???
అది చూసి ఏడుపులు మిన్ను ముట్టాయి... ఆ ప్రదేశం అంతా శోకరాగాలే...

 నా మనసులోకి ఆలోచనలు నిండాయి.
 కాలిపోతోంది.. .80 ఏళ్ల జీవితం.... మండిపోతోంది చితిలో..
ఎన్ని కలలు కందో..ఎన్ని తీరాయో..ఎన్ని మిగిలాయో..ఎంత ఆనందం పొందిందో..ఎంత
దుఖాన్ని దిగమింగిందో..??
కూతుర్లు ..కొడుకులు..కోడళ్ళు..మనవలు..మనవరాళ్ళు...ఇంత మందికి ప్రేమని అందించిన
మాతృ మూర్తి..
...జీవచ్చవంలా, నరక యాతన అనుభవించి....కాలిపోతోంది అమ్మమ్మ ..

ఒక్కసారిగా గుండె లోతుల్లోని తడి ఎగిసింది.
రెండు కన్నీటి బొట్లు నేల రాలాయి .


3 comments:

Unknown said...

hi chakri garu

enti online ki ravatla blog lonu emi rayatla em chestunnaruuuuuuuuuu
mee alochanale rayochuga

chakri said...

విను గారు, రాద్దాం రాద్దాం అనుకొంటూనే కాలం గడిచి పోతుంది.. తెలుసుగా బద్ధకం..

విజయ క్రాంతి said...

ఇప్పుడే చూసాను .
అధ్బుతం ...చాల రోజుల తర్వాత చదివిన ఒక మంచి టపా. ఒక్క క్షణం నా గురించి ఆలోచిస్తే ..నిజమే మనం రాళ్ళు గా మారిపోయమేమో .... డబ్బు చుట్టూ తిరుగుతూ అసలైనవి వదిలేసమేమో ...
ఎందుకో మనసంతా అలజడిగా వుంది ...

మీకిది న్యాయమా ? ...