Oct 11, 2011

నీసంగతేంటి ???


చిన్ననాటి స్నేహితుడు అనుకోకుండా కలిసాడు. వాడు మొదటినుంచి లెక్కల మాష్టారు. అంటే లెక్కలు  బాగా చేస్తాడని కాదు. లెక్కలు బాగా వేస్తాడు. ఎంత సంపాదించాను,..ఎంత కూడబెట్టాను....ఇదీ వాడి లెక్క.
పలకరింపులు అయ్యాయి.
ఆకాశం నీలం చిక్కనయ్యి  చీకటిగా మారుతోంది. విద్యుద్దీపాల  వెలుగులో సిటీ అంత దగ దగ లాడుతోంది.. కిందకొచ్చి  వరుసలో నిల్చున్నాయా అన్నట్టున్నాయి స్ట్రీట్ లైట్స్.. తొందరగా ఇల్లు చేరాలని జనాలు గుంపులు గుంపులుగా పరుగులు తీస్తున్నారు  వాహనాల మీద.
నేను, వాడు ఒక చిన్న కేఫ్ లో కూర్చొని ఉన్నాం,అరగంట క్రితమే చాయ్ తాగి మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్య మౌనంలో  ఏమి తోచక ట్రాఫిక్ ని గమనిస్తున్నాను.
డిన్నర్ ప్లాన్ ఏంటి ? అడిగాను..
ఎక్కడోచోట తిని ఫ్రెండ్ రూంకి వెళ్ళటమే..అన్నాడు.
మందు అలవాటుందా ?? 

'మందు' అనగానే కళ్ళు కొంచం తెరుచుకొని..పెదాలు విచ్చుకున్నాయి..నవ్వుగా ..
సిగ్గుపడుతున్నట్టు చెప్పాడు   "ఏదో అప్పుడప్పుడు.. మామ గారింటికి వెళితే తప్పదు కదా" 

మందు తాగకపోతే ఇంటికి రానివ్వరా  ఏంటి ??
పెళ్లి గిళ్ళీ లేని వాడివి నీకేం  తెలుసురా.. మా తోడల్లుళ్ళ ముందు చులకనైపోనా..తాగకపోతే  వాళ్లకి
షోడాలు కలుపుతూ,వాళ్ళ సొల్లు కబుర్లు వింటూ కూర్చోవాలి..పండక్కి వెళ్ళాకపోతేనా ...మా ఆవిడ ఊరుకోదు.. ముందే పల్లెటూరు..ఏమి తోచదు. మొదటి సరి షోడా లు కలిపినా తరవాత మందు అలవాటు చేసుకున్నా... బాగోతం చెప్పుకొచ్చాడు.
సరే...ముందు గుక్కెడు మందుతాగి ఎక్కడయినా డిన్నర్ చేసి ఆ తరవాత మీ ఫ్రెండ్ రూం లో డ్రాప్  చేస్తాలే...అన్నాను నేను.
అలా అన్నది  స్నేహితుడి మీద ప్రేమతో  కాదు..ఎందుకో మనసు బాలేక.
వాడు సరే అన్నాడు..

పొడి పొడి మాటలతో మొదటి రెండు పెగ్గులు పూర్తయ్యాయి. మూడో పెగ్గు రెండో సిప్పు తాగాక మొదలు పెట్టాడు..
" మన ఉళ్ళో  రెండు ఇల్లు కొన్నాను.. బాలెన్సు దాదాపు అయిదు  లక్షల వరకు ఉంటుంది.. బంగారం ధర పెరక్క ముందే మా ఆవిడకి పది  తులాల నగలు  చేయించాను.మా ఇద్దరి పేరా..ఇద్దరు పిల్లల పేరా తలా రెండు లక్షల  LIC పాలసీలు ఉన్నాయి. పిల్లల పేరు మీద చెరో రెండు లక్షల fixed  చేయించా, ..మా ఆవిడా చాలా రోజుల నుంచి 'కారో' అని గోల చేస్తోంది. దానికి నాలుగు లక్షలు అట్టి పెట్టాను. చూడాలి రేపో మాపో...అంటూ  వ్యాపారంలో తను ఎలాంటి సవాళ్లు  ఎదుర్కొంటూ..నానా కష్టాలు  పడి  సంసారాన్ని ఎంత చక్కగా లాక్కోస్తున్నాడో ...... తన జీవిత విజయ గాధ చెప్పుకొచ్చాడు....అప్పటికి నాలుగో పెగ్గు ఖాళీ చేసి  అడిగాడు. 



" మరి నీసంగతేంటి ??  "

1 comment:

Anonymous said...

నిజమే ,నేనూ అడుగుతున్నాను చెప్పు ,మరి నీ సంగతేంటి ?చక్రీ?