Aug 25, 2009

గుర్తున్నాయా ఆ రోజులు


internet explorer ....www.స్వగతం .com > వేలూరు > బాల్యం

గుర్తున్నాయా రోజులు.. ఆటలు.. హాయి.

మొక్క జొన్న కంకులు..మిరప కారం..రేగు పళ్ళు..ఔషపూలు
డీప్ ఆట..దేవుని పుస్తకాల వాసనా..మిట్ట మధ్యాన్నపు ఎండా ...గుర్తున్నాయా ??

ఆంజనేయస్వామి గుడి గంట నాకింకా వినపడుతూనే ఉంది
రాములు మామ పెళ్లికి దూలాలకి రంగులేస్తున్నాము..
రాజయ్య తోటకి నీళ్ళు పెడుతున్నాడు...పోచయ్య చుట్ట ముట్టిస్తున్నాడు..

బోడి గూట్లో నూనే డబ్బా.. పాలమామయ్య రూంలో సిన్ని ఫాను..
చార పత్తర్ లో వెనన్న గెలిచాడు..లచ్చన్న మల్లి తొండి పెట్టాడు..

ఓం నమశివాయ జ్యోతి అక్క తైతక్కలు..వీరి వీరి గుమ్మడి పండు మాధవి అక్క
బొంద బావి లో చండు పడింది..బాగన్న బాయి...విక్రంగాడి కుక్క ఈత. .
ఒద్దు మామ ఒద్దు మామ రఘు బావ ఏడుపు..

పీల్చి ఉమ్మేసిన చెరుకుకు నల్ల చీమలు పట్టాయి.. దొంతులర్ర లో గిరన్న దాక్కున్నాడు..
పిట్ట గుర్తుకే ఓటెయ్యండి....సర్పంచ్ ఎలక్షన్లు

దొరా.. తుపాకుల నర్సిహ్మని పిలుపు.. గచ్చు దగ్గర చెయ్యి కడుక్కో అమ్మ అరుపు..

పాము కాయలు..రుద్రాక్ష పూలు..ఎపుడు బియ్యం... సీతాఫలాలు..

గ్యనేశ్వర్ గిర్ని పడుతున్నాడు..,విట్టల్ షర్టు కుడుతున్నాడు..
కోతి రామయ్య గుంట కళ్ళు... గోరే మియా గళ్ళ లుంగీ..
అనంతగిరిపల్లి మర్రి చెట్టు..దావరి చెరువు కలువ పూలు..
.... గుర్తున్నాయా??

మల్లి గాడు కైకిలి అడుగుతునాడు..

నాగుల వాసం.. అమ్మమ్మ ఉపవాసం..
తాత పూజ ముగిసింది..విక్రం మొహం గండు పిల్లిలా తయారైంది..
సాయబాన్ లో పేడ వాసనా ..అంబా అని పసుల దీనమైన అరుపు..

గోధూళి కుంకం చల్లుతోంది..వెంకట్రామయ్య సర్ ఇంట్లో మౌనం రాజ్యమేలుతోంది
చింత చెట్టు మీద.. తల్లికొంగల ఫీడింగు..పిల్ల కొంగల డాన్సింగు ..

అమ్మమ్మ మడి కడుతోంది..అమ్మ సువర్ణ చిన్నమ్మకి జడేస్తోంది.
లచ్చి గాడు..గోటిలు లెక్క పెడుతున్నాడు ....రోజి అత్త చంకన గుబులుగా చూస్తోంది..
తాత పాలు పిండుతున్నాడు.. బావ ద్వాదశ స్తోత్రాలు వల్లే వేస్తున్నాడు..
నేను విక్రం గాడికి చిరంజీవి సినిమా కళ్ళకి కడుతున్నాను..

ఆకాశం చీకటి జడ విప్పుతోంది.. విజ్జత్త వుక్కన్నకి దుప్పటి కప్పుతోంది..
ఆనందు గాడింట్లో వార్తలు వస్తున్నాయి..
అత్తలు పళ్ళరసం పిండుతున్నారు..అమ్మలు వంటలు వండుతున్నారు..
మంచాల్లో తలుపులు ముసారు..వంటింట్లో ఇస్తాల్లు తీసారు
రాణి అత్త చీటిలాట మొదలెట్టింది..
మాధవి అక్క చుట్టూ పొతారం దయ్యాలు మూగాయి...
పీట మీద తాత గుర్రు వినబడుతోంది..
వాకిట్లో జంబుఖానా ..మనమంతా కలల్లో బందీఖానా
వేప చెట్టు మీద కాకుల అరుపులు.. తూరుపున పొద్దు పొడుపులు..

లీలగా గుర్తున్న బాల్యం..అదేకదా స్వర్గ తుల్యం.

Aug 16, 2009

చైత్రo



ఆ రోజు చైత్రమాసపు తోలి రోజు..మావిళ్ళుపూతలు పెట్టి కొత్త పెళ్లి కుతుర్లలా తయారైన రోజు, కోయిలలు సన్నాయివాయించే రోజు, వేము కొత్త చేదుని సంతరించుకున్న రోజు..
అందరికి నూతన సంవత్సరం.. పండగ రోజు. కానీ నారాయణ రావు గారింట్లో రెండు పండగలు ఒకే సారి వస్తాయి..ఒకటిఉగాది అయితే, ఇంకోటి తన కూతురు మృదుల పుట్టిన రోజు.
అలాగని ఏ ఆర్భాటము, ఆడంబరము ఉండదు అ యింట్లో..కేవలం మనసుల్లో ఆనంద డోలికలు తప్ప.
మృదుల తలారా స్నానం చేసింది, చిలక పచ్చ పరికిణి మీద గులాబీ రంగు ఓణీ వేసింది.చిలకమ్మ లాగా. తలలో జాజిమల్లెలు.. నుదుటన తిలకం.. పదహారణాల తెలుగు పడుచులా ఉంది.తల స్నానం చేసింది కనక వెంట్రుకలు అరబెట్టాలనిచిన్న బ్యాండ్ మాత్రం వేసింది జుట్టుకి.
అ రోజు దగార్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మ నాన్నలు పేర అర్చన చేయించటం ఆమె చేసే మొదటి పని. అదితనకీ జీవితాన్నిచినందుకు ఆమె ఇచ్చే గౌరవం.