Aug 9, 2008

ANVESHANA

సాయంత్రం! ఉదయం రాత్రి గా మారే సమయం..పక్షులు తిరిగి తిరిగి అలసి గూటికి చేరే సమయం...ప్రతివాడు పని ముగించి ఎపుడెపుడు ఇల్లు చేరుకుందామా అని వడి వడి గా వెళ్ళే సమయం. ఆ సమయం లో నాకు ఏ ఒక్కరి మొహంలోను సంతోషం కనిపించదు. ఇక నా సంగతి అయితే మరీను ..నన్ను సాయంత్రాలు పెట్టె బాధ ఆ నరకం లో కూడా ఉండదేమో.. అసలు నరకమంటే సాయంత్రమేనేమో.. మసక చీకటి తో పాటే బాధ కూడా మెల్లగా ముసురుకొని చిక్కనై అశాంతి తో అటు ఇటు పొర్లుతూ నిద్రలోకి జారి కనుమరుగవుతుంది... మళ్లీ సాయంత్రం వరకి హయిగా గడిచిపోతుంది .. అసలు ఇది ఎలా మొదలైందంటే..
అప్పుడు నేను పదవ తరగతి చదువుతుండే వాడిని. రోజు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళడం , సాయంత్రం చీకటి పడేవరకు ఏవేవో ఆటలు. తరవాత home work, తిండి, నిద్ర ఇలా గడిచిపోయేది.. అప్పట్లో తెలియదు ముందుది ముసళ్ళ పండగ అని..
మా ఇళ్ళన్నీ ఊరికి కొంత దూరంగా ఉండటం మూలాన రాత్రి దొంగల భయం ఎక్కువగా ఉండేది. వైశాలి వాళ్ళ ఇల్లు చాల పెద్దది కావటంతో దాన్ని మూడు నాలుగు పోర్షన్లు గా విడగొట్టి ఫామిలీస్ కి అద్దెకిచ్చారు . ప్రతి ఇంట్లోను ఇద్దరు ముగ్గురు పిల్లలు. సాయంత్రమైందంటే చాలు ఓ యాభై మంది పిల్లలం పెద్దగా గోల చేస్తూ ఏవేవో ఆటలు. ఆటల్లో మునిగి తేలేది జీవితం . కొంత కాలం క్రికెట్ ,కొంతకాలం కేరమ్స్, చెస్, గోలీలు, గిల్లి దండా ..తరవాత చక్కగా తయారై T.V ముందు హాజరు ఇలా ఉండేది వ్యవహారం .
పదవ తరగతి చివర్లో మొదలైంది ఈ బాధ , తెలియని వెలితి. సాయంత్రాలు ఆట మానేసి ఆకాశం కేసి చూస్తూ ఏదో ఆలోచించటం, రాతి నిద్ర పట్టక పోవటం.. అప్పటికింకా తెలీదు అది యవ్వనం తాలూకు చిహ్నం అని. రోజు పొట్టి లంగాలతో చెంగు చెంగున గెంతుతూ ఆడుకునే అమ్మాయిలు అకస్మాత్తుగా పెద్దాళ్ళలాగ ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఎక్కడ భయం బెరుకు మొదలయ్యాయి వాళ్లతో మాట్లాడాలంటే..ఆటలన్నీ మానేసి ఎప్పుడు అమ్మ వెంటే ఉండేవారు. మేమేమో లాగులు ఎగదోప్పుకుంటూ గిల్లి దండా గోలీలు ఆడుకునే వాళ్ళం, ఎన్నిసార్లు మమల్ని గేలి చేసినట్టు నవ్వినా మాకేమి అర్థం అయ్యేది కాదు.
ఎందుకో మా ప్రపంచం కూడా ఒక్కసారిగా మారిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు పెద్దాళ్ళలాగ ప్రవర్తించటం మొదలు పెట్టారు. ఆటలన్నీ మానేశారు , కొంత మంది పొడుగు లాగులు కుట్టించుకున్నారు .ఏడ్చి గీ పెట్టి నేను కూడా pants కుట్టించుకున్నా. అసలా దుమ్ములో ఎలా ఆడాం అని అనిపించింది తరవాత. సాయంతం శుభ్రంగా తయారై చేతిలో ఒక పుస్తకంతో ఏదో చదివి నట్టు pose ఇవ్వటం మొదలెట్టాం అందరం. మాట్లాడే తప్పుడు సినిమాలు వీటి గురించి కాక సబ్జెక్టు, ఫిలాసఫీ రాజకీయాలు ఇలా పెద్ద విషయాలు చర్చల్లోకి వచ్చేవి . అమ్మాయిలు కూడా తెల్లగా ముఖాలు కడుక్కొని దేవుని దీపాలు వెలిగించటం, పేరంటాలు , పెద్దాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడటం చేస్తుందే వారు .
వైశాలి కంటికే కనిపించడం మానేసింది, ఒకవేళ ఎదురు పడితే కొత్తగా చూసుకోవటం , మాట్లాడటానికి సిగ్గు పడటం, లేక దూరంగా తొలగి పోవటం చేస్తోంది.. అన్నాళ్ళు కలిసి ఆడిన అమ్మాయి అలా ఎందుకు చేస్తోందో .. ఆ కొత్త ప్రవర్తనకి అర్థం ఏంటో అని ఆ అమ్మాయి గురించే ఆలోచించే వాడిని. ఇలా ఆలోచన ఎక్కువైనా కొద్ది ఏదో కోల్పోతున్నామనే భావన దాన్ని తిరిగి పొందాలనే పట్టుదల మొదలయ్యాయి..ఎన్ని సార్లు ఎదురుపడినా తప్పించుకొని పోయేది.. ఏదో తప్పు చేస్తున్న భావన ప్రవేశించింది మనసులోకి..
ఓ ఆదివారం తల స్నానం చేసి మేడపై ఎండకి నిల్చున్నాను. దూరంగా అ అమ్మాయి కనపడింది ఎక్కడికేల్తుందో అని చూస్తూ ఉండగా .. ఆశ్యర్యం .. మా ఇంట్లోకే ప్రవేశించింది, చేతిలో చిన్న బుట్టతో
"అత్తా అమ్మ పూలు తీసుకురమ్మంది " అంది మా అమ్మతో
"అలాగే మాకు కొన్ని ఇచ్చి వెళ్ళమ్మా " అంది అమ్మ
మాది చిన్న ఇల్లు ఖాలీ స్థలం ఎక్కువ , ఆ స్థలం లో పూల మొక్కలు వేశాం.
నీలి డిసెంబర్ పూలు నవ్వుతున్నాయి, చేమంతులు తలలూపుతున్నాయి, కనకాంబరాలు విచ్చుకోనేలేదు,నేనేమో ఆమె కంట పడాలని ప్రయత్నం మొదలెట్టా. తమని గమనిస్తున్నామని ఆడాళ్ళకి ఎలా తెలుస్తుందో.. నేను చూస్తున్నానని వైశాలికి తెలుసు, కానీ నావైపు చూడదు, కళ్ళు కలపాలని నా ప్రయత్నం.పూలన్నీ కోసి ఇంట్లోకి వెళ్లి మా అమ్మకి కొన్ని పూలు ఇచ్చి వెళ్ళిపోతూ నా వైపు ఒక చూపు విదిల్చింది,ఆ చూపు నా గుండెలో దూరి గిలిగింతలు పెట్టి నాకిదివరకెన్నడూ పరిచయం లేని సంతోషాన్ని కలిగించింది. అది మొదలు నేనా చూపుకై ఆమె చుట్టూ తిరగటం.. సాయంత్రం బడి నుండి వస్తూ ఈ చింత చెట్టు క్రిందో ..పేరంటాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తూనో .. ఉయ్యాల బల్ల ఊగుతూనో..వాళ్ళింటి నుండి మా అమ్మని తీసుకొస్తుంటే బొట్టు పేడుతునో..అందరు T.V చూస్తుంటే తను మాత్రం నావైపు ఒక్కసారి.... చూసేది ...నాకు మళ్లీ తెలీని సంతోషం .. అదేం చిత్రమో ఆ సంతోషం క్షణం లో మాయం, మళ్లీ ఆ చూపుకై వెతుకులాట.. ఎలాగు 1st class లో pass అవతామని చదువుపై ధ్యాస నిలుపలేదు.రోజులన్నీ ఆ చూపుకోసం తపించటం తప్ప.. పరిక్షలు ముగుసి results వచ్చాయి. అనుకున్నట్టుగానే నాకు 1st class వచ్చింది.
ఒద్దు మొర్రో అన్న వినకుండా వేరే ఊరిలో ప్రైవేట్ కాలేజీ లో join చేసాడు మా నాన్న.ఉదయం 8 గంటల కల్లా వెళ్ళటం, సాయంత్రం ఏ 6 గంటలకో అలసి పోయి రావటం, దీనికీ తోడూ తట్టెడు home work ..ఇక వైశాలిని చూడటానికి వీలులేకపోయింది. నా ఆరాటం ఎలాగైనా తెలియ జెప్పాలని ఒక రోజు చింత చెట్టు కింద గోడపై ఇద్దరి పేర్లు రాసాను.ఆ అమ్మాయి చూసిందో లేదో కాని వాళ్ళ అన్నయ్య కంట్లో మాత్రం పడింది. ఓ సాయంత్రం నన్ను మా అన్నయ్యని పిలుచుకు పోయారు ఆ చెట్టు క్రిందకి, ఇది మీ వాడు చేస్తున్న నిర్వాకం అని. వాళ్ళలోఒకడు ఆవేశం తో ఉగిపోతూ నా చెంప చెళ్ళు మనిపించాడు. మా అన్నయ్య అడ్డుపడి ఇక మళ్లీ ఇలాంటిది జరగదని హామీ ఇచ్చాడు. నాకు ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలో తెలిలేదు. మెల్లగా అన్నయ్య వెనకాల నడిచాను. ఇంట్లో కి వెళ్ళాలంటే ఏదో భయంగా సిగ్గు గా ఉంది, అన్నయ్య అమ్మకి నాన్నకి విషయం చెప్పాడు. మా అమ్మ బయటికి వచ్చినా వైపు అదోలా చూసింది , ఎందుకో తెలిదు నా కళ్ళనుండి బొట బొటా కన్నీళ్ళు రాలాయి. ఆ రోజు నుండి నేను మళ్లీ ఆ అమ్మాయి ఇంటి చాయలకి వెళ్ళలేదు.

నా మనసులోని ఆ సంతోషపు పొరలని తట్టే ఆ చూపుకై ఇంకా సాగుతూనే ఉంది నా అన్వేషణ.