Apr 18, 2014

యురేకా..!!!



అదుగో...గోడమీద బల్లి.. !!
ఉంటే ఉండనీ నీదేం పోయిందీ
అవును ఓ మూల గోడమీద పురుగూ పుటకా కనపడితే గటుక్కున మింగి ఏదో ఓ మూలనక్కుతే కాదంటానా ??   పన్నెండువేలు నెలకి అద్దెకడుతూ ఇల్లు తీసుకుంటే.. అది అటు ఇటూ తిరుగుతోంది ఇల్లంతా నాదే అన్నట్టు. అసలే ఒంటరిగా నెట్టుకొస్తోంటే దానికి మాత్రం ఓ  జంట..అదీ ఇదీ ఒకదానివెంట ఒకటి పరుగులు. అది కీచులాటో..పోట్లాటో,  తెలుగు సినిమాల్లో హీరోఇన్ వెనక హీరో పరిగెత్తినట్టు రొమాంటిక్ పాటో.....  నాకెందుకులే గానీ ..ఎక్కడ టపీమని కింద పడతాయో అనేది నా భయ్యం.

ఓ రోజు  గోడమీద ఉన్నది ఉండక.. నేలదిగి పరుగులు తీస్తే ఇహ నావల్ల కాలే.. చీపురందుకొని వెంటపడి అవతలకి ఊడ్చేసి హాయిగా ఊపిరి తీసుకున్నా..
రెండో రోజు మళ్ళీ ప్రత్యక్షం... .ఈ ఇల్లు దానికి పర్మనెంట్ అడ్రస్ అని నాకు తెలిసిందప్పుడే. సర్లే ఎక్కువ ఆలోచిస్తే జీవితం విరక్తి పుడుతుందని అనుకుని దాని మానాన దాన్ని వదిలేసా.
కానీ ఇవ్వాళ కిచెన్ వెనక బాల్కనీ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాన్నా.. డోర్ కి ఓ మూల ప్రత్యక్షం.. ఉష్ అన్నా..హశ్ అన్నా ఎంతకీ కదలదు.  చీపురుతో తాకి చూసినా చలనంలేదు. చచ్చిందా గోడమీదే అనుకుంటే గుడ్లు మిటకరిస్తోంది.  " నీవేం పీకగలవురా...ఒక్క దూకు మీదకి దూకానంటె..ఒళ్ళు జలధరించి చస్తావ్"  అని వెక్కిరించినట్టనిపించింది. అవును ఓ సారి బల్లి పడి పాకి నప్పుడూ.. ఒళ్ళంతా మహా అసహ్యంగా...జలధరింపు. గంట సేపు స్నానం చేస్తేగానీ తగ్గలేదు మరి.
ఓటమి తాలూకు అవమాన భారంతో..సరే ఎంతసేపుంటావ్లే అనుకొని వచ్చికూర్చున్నా..

రెండుగంటలయ్యింది ..నా ఓపికని పరీక్షిస్తూ..అది అక్కడే బొమ్మలాగా ఉన్నది కానీ మిల్లీమీటరు కూడా కదల్లేదు.  ఇహ లాభంలేదని.. గూగులింగు మొదాలెట్టా..
బల్లులని పారద్రోలటం ఎలా.. ??

1)పెస్ట్ కంట్రోల్ కి ఫోన్ చేయండీ  ( ఇండియా బాబూ..రేపిస్టుల బారినించే కాపాడలేరు..ఇహ బల్లులా )
2) లక్ష్మణరేఖగీయండి..( చంపటం నా వల్ల కాదు )
3) ఉండటం మంచిదే,పురుగులని తింటుంది..( ఎవరొద్దన్నారు,నా సమస్యవేరు)
4)నెమలీకలు పెట్టండి..( ఇదివరకు పెడితే దానిమీదనుంచే పాకాయి )
5) గుడ్లు పొచ్చలు వేలాడ దీయండీ.. ( మిత్రుడి ఇంట్లో ఇవి పెద్దగా పని చేయలేదు)
6) పిల్లులుంటే బల్లులు రావు.. ( పిల్లినెక్కడ తేవాలిప్పుడూ )

ఒక్క అయిడిగా కూడా పనికొచ్చేదిలా కనిపించలే..

చివరాఖరికి ఒక అయిడియా తళుక్కున మెరిసింది.  చూద్దాం వర్కవుటవుతుందా అని ట్రై చేసా.. ఎంటదీ అంటారా ?? ఏమీ లేదు... పిల్లి కూతని డౌన్లోడు చేసి..ఫోన్లో ఎక్కించి రిపిటెడ్ గా ఆ సౌండుని ప్లే చేసా...
మూడో కూతకే...బల్లిలో చలనం వచ్చింది. అటూ ఇటూ చూసింది..సౌండ్ కొంచం పెంచా.. బల్లి తలతిప్పి చూస్తోంది ఎక్కడుందా పిల్లీ అన్నట్టుగా.. మరికొంచం సౌండిచ్చా.. దాదాపు మూడు  గంటలు చలనం లేనట్టు ఆస్కార్ రేంజ్ లో నటించిన బల్లిముండ ఇహ తోక వెనక్కి తిప్పి  తలుపు సందులోగుండా.. మెల్లిగా బయటికి పరారయ్యింది... !!  
 చెట్టునుంచి  ఆపిల్ పండు కిందపడ్డప్పుడు  న్యూటన్ కి  కలిగిన  ఆనందమే  నాకు ఒక్క క్షణం కలిగింది.

ప్రయోగం సగం సఫలం.. మరికొన్ని ప్రయోగాల తరవాత పేటెంట్ హక్కు కోసం ప్రయత్నాలు మొదలెట్టాలి. !! :) :)